సొంత పార్టీలోని నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని, రాహుల్ గాంధీ చెప్పినందుకే కులగణన జరిగిందని, లేకుంటే ఈ రెడ్లు ఎప్పుడు చేసేవారని ప్రశ్నించారు. రెడ్లు తెలంగాణనే అడ్డుకున్నారని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన రెడ్లే ఎంపీలుగా పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో యాదవ సామాజికవర్గ నేతల ఆత్మీయ సమావేశానికి అంజనీ కుమార్ యాదవ్ హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంట్లో కూర్చున్న దానం నాగేందర్‌ని తెచ్చి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోయాడని, తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ నేతల వల్ల రాలేదని, సోనియా గాంధీకి చెప్పి తనను లాలూ ప్రసాద్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడని చెప్పారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అడ్డుతగిలారని, తనకు కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే అని ఆరోపణలు చేశారు. రాజ్యసభ యాదవులదే అందుకే తన కొడుకు అనిల్ కుమార్ యాదవ్‌కి ఇచ్చారని చెప్పారు. యాదవులకు అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటినుండి ఊరుకునేది లేదని వివాదాస్పద కామెంట్లు చేశారు.








