రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలకు గండి కొడతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. కూటమి ధర్మాన్ని కాపాడుతూ పాత ఫార్ములాకే కట్టుబడి ఉండాలని టీడీపీ-జనసేన అధినాయకత్వాలు నిర్ణయించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జోరందుకుంది.
మంగళవారం ఉదయం ఉండవల్లి కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకుని దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ తర్వాత కూటమి సమన్వయ కమిటీ ప్రతినిధులు పల్లా శ్రీనివాస్, రామానాయుడు సైతం భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే ప్రతిపాదించినట్లుగానే లోకేష్ సిద్ధం చేసిన టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్ల కేటాయింపు సమన్వయ ఫార్ములాకే ఇరు పార్టీల సీనియర్లు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారనే వార్తలు బయటకు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలం పెరిగిందని, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావించిన జనసైనికుల ఆశలకు ఈ కొత్త పరిణామాలు గండి కొట్టాయనే ప్రచారం జరుగుతోంది.. దామాషా ప్రకారం తమకు స్థానాల సంఖ్య పెరుగుతుందని భావించినప్పటికీ, గతంలో ప్రతిపాదించిన 15 శాతం సీట్లకే పరిమితం అనే వార్తలు చక్కర్లు కొడుతుండడంతో జనసేన శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
క్షేత్రస్థాయిలో పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న చోట్ల కూడా మిత్రపక్షాల సర్దుబాటు పేరుతో పాత రేషియోనే వర్తింపజేస్తుండటం స్థానిక నేతలకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. కీలకమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడనుండటంతో, జనసేన ప్రాతినిధ్యం పరిమితం కానుందనే చర్చ నడుస్తోంది.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట చైర్మన్, 50 శాతం కార్పొరేటర్లు అడిగారని కూటమి సమన్వయ కమిటీ సీఎంకు వివరించగా, బీజేపీ ఆలోచన మరోలా ఉందని టీడీపీ అనుకూల మీడియాలో ప్రసారాలు మొదలయ్యాయి. తమ ఎమ్మెల్యే లేనిచోట చైర్మన్, కార్పొరేటర్లను బీజేపీ అడుగుతుందని, ఇతర చోట్ల పార్టీ బలపడే అవకాశం ఉందనేది బీజేపీ ఆలోచనగా ఉందన్న పల్లా, నిమ్మల సీఎంకు వివరించినట్లుగా మీడియా సారాంశం.








