ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పిందని, కూటమిని నమ్మి మోసపోయామని రోడ్ల మీదకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రభుత్వంపై అభ్యర్థుల ఆగ్రహం..
ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఏపీపీఎస్సీ అధికారులు స్పందించలేదు. పరీక్షను వాయిదా వేయకుండా టైమ్ అవ్వడంతో నిన్న సాయంత్రం ఆఫీస్ క్లోజ్ చేసుకొని వెళ్లిపోయారు. కాగా, గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తామని అభ్యర్థులను నమ్మించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మోసం చేశారని అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఆడియోల ద్వారా సీఎం చంద్రబాబు, ట్వీట్ తో మంత్రి లోకేష్ చివరి వరకు డ్రామాలు ఆడారని, పరీక్ష వాయిదా వేస్తామని నమ్మించి వంచించిందని గ్రూప్ 2 అభ్యర్థులు మండిపడుతున్నారు.
సగం అయినా హాజరవుతారా..?
అర్ధరాత్రి వరకు గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ ఎగ్జామ్ వాయిదా పడలేదు. మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ కి ఒక్కొక్కరుగా అభ్యర్థులు చేరుకొంటున్నారు. ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10 గంటలకు గ్రూప్ 2 మెయిన్ పేపర్ 1 ఎగ్జామ్, మధ్యాహ్నం 3గంటలకు పేపర్ 2 ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేస్తుందని భావించి అభ్యర్థులు ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. కానీ, రాత్రికి రాత్రి పరీక్ష యధావిథిగా కొనసాగుతుందని తెలియడంతో ఎగ్జామ్స్ సెంటర్ వద్దకు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. 175 సెంటర్లలో పరీక్ష రాయనున్న 92,250 మంది గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, సగం మంది అయినా హాజరవుతారా అనే అనుమానం నెలకొంది.