ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి (Corona Pandemic) మళ్లీ ముంచుకొస్తోంది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ప్రధానంగా కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu), మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్నట్లుగా వార్తలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్ (AP Health Department) కరోనా మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచించింది. ముఖ్యంగా ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర పౌరులను కోరింది. రైల్వే స్టేషన్లు (Railway Stations), బస్టాండ్లు (Bus Stands), విమానాశ్రయాలు (Airports) వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.
జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్ లలో మాస్క్ లు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.