సచిన్ పక్కన నా పేరా?.. అండర్సన్ కీలక వ్యాఖ్యలు!

సచిన్ పక్కన నా పేరా?.. అండర్సన్ కీలక వ్యాఖ్యలు!

ఇంగ్లండ్-భారత్ (England-India) టెస్ట్ సిరీస్‌ (Test Series) విజేతకు ఇచ్చే ట్రోఫీకి ఇదివరకు ‘పటౌడీ సిరీస్’ (Pataudi Series)అని పేరు ఉండేది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆ పేరును మార్చి, ‘అండర్సన్-టెండూల్కర్’ (Anderson-Tendulkar) ట్రోఫీగా నామకరణం చేసింది. గతంలో భారత్‌లో జరిగే సిరీస్‌లకు ‘ఆంథోనీ డి మెల్లో’ (Anthony De Mello) ట్రోఫీని అందించేవారు. ఇకపై భారత్‌లో జరిగినా, ఇంగ్లండ్‌లో జరిగినా.. రెండు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ విజేతకు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీనే అందజేస్తారు. విజేత జట్టు కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ను బహుకరిస్తారు. ఈ ట్రోఫీ పేరు మార్పుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పందించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు పక్కన తన పేరు ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

“సచిన్ పక్కన నా పేరా? అని ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు” – జేమ్స్ అండర్సన్
“ఒక ట్రోఫీకి మన పేరు పెట్టడం చాలా పెద్ద విషయం. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడి పక్కన నా పేరు ఉండటం ఇంకా గొప్ప విషయం. సచిన్ పక్కన నా పేరా? అని నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. సచిన్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించడం చాలా సంతోషంగా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి సచిన్ ఆట చూశాను. ప్రత్యర్థిగా కూడా తలపడ్డాను, వికెట్ కూడా పడగొట్టాను. ఒక దేశ భారాన్ని తన కెరీర్ ఆసాంతం భుజస్కంధాలపై మోస్తూ రాణించిన గొప్ప ఆటగాడు సచిన్. సచిన్‌తో కలిసి ట్రోఫీలో భాగం కావడం చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను” అని జేమ్స్ అండర్సన్ వ్యాఖ్యానించారు.

సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ గణాంకాలు
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన టెస్ట్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డులు సచిన్ సొంతం.

మరోవైపు, జేమ్స్ అండర్సన్ 188 టెస్ట్ మ్యాచ్‌లలో 704 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్స్ తీసిన పేసర్ అండర్సనే కావడం విశేషం. మాజీ స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) (800 వికెట్లు), షేన్ వార్న్ (Shane Warne) (709 వికెట్లు) అండర్సన్ కంటే ముందున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment