‘నూరు’కు 10 శాతం క‌మీష‌న్‌.. టీడీపీ ఎంపీ – ఎమ్మెల్యే మ‌ధ్య వివాదం

'నూరు'కు 10 శాతం క‌మీష‌న్‌.. టీడీపీ ఎంపీ - ఎమ్మెల్యే మ‌ధ్య వివాదం

తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) చెందిన ఎంపీ(MP), ఎమ్మెల్యే(MLA) మధ్య కమీషన్ల (Commissions) వివాదం తీవ్ర దుమారంగా మారింది. ఇది మా సామ్రాజ్యం.. 10 శాతం క‌మీష‌న్‌లు (10 Percent Commission) ఇవ్వ‌క‌పోతే సామగ్రి ఎత్తుకెళ్లిపోతాం అంటూ ఏకంగా బెదిరింపుల‌కు దిగిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. అనంతపురం జిల్లాలో (Anantapur District) ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా సొంత పార్టీ ఎంపీనే బెదిరించిన ఘటన వెలుగులోకి రావడంతో, టీడీపీలో వసూళ్ల వ్యవహారం ఏ స్థాయిలో నడుస్తోందో స్పష్టమవుతోంద‌న్న విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అనంత‌పురం జిల్లాకు చెందిన కొత్త‌గా ఎన్నికైన టీడీపీ ఎంపీకి సన్నిహిత బంధువైన ఓ కాంట్రాక్టర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైల్వేకు సంబంధించిన పైపులైన్ పనులు చేపట్టారు. సుమారు రూ.7 కోట్ల విలువైన ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించారు. అయితే, గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే స‌ద‌రు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి, పనులు తమకు అప్పగించాలని లేదా 10 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై కాంట్రాక్టర్ “ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడండి” అని సమాధానం ఇవ్వడంతో, ఎమ్మెల్యే తన తమ్ముడిని రంగంలోకి దించారు. ఎమ్మెల్యే సోదరుడు నేరుగా ఎంపీకి ఫోన్ చేసి, “ఇక్కడ ఎవరు పనులు చేసినా 10 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే” అంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం. తానే ఈ పనులు చేయిస్తున్నానని ఎంపీ చెప్పినా వినకుండా “ఎంపీ అయినా సరే వదలొద్దని అన్న చెప్పాడు” అంటూ దురుసుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆగ్రహించిన కొత్త‌గా ఎన్నికైన‌ ఎంపీ, సదరు ఎమ్మెల్యేను ఎదుర్కునే అంగ‌బ‌లం లేక పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధిని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అత‌ని సోద‌రుడు కమీషన్ల కోసం వేధించడం సంచ‌ల‌నంగా మారింది. ఒక ఎంపీ ప‌రిస్థితే ఈ ర‌కంగా ఉంటే రాష్ట్రంలో పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపారాలు చేసుకునేవారి ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఎంపీ ఫిర్యాదుతో స‌ద‌రు ఎమ్మెల్యేతో టీడీపీ పెద్ద‌లు మాట్లాడిన‌ప్ప‌టికీ, ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.

మళ్లీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్
“పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా? ఇది మా సామ్రాజ్యం. ఇక్కడ మేమే అధిష్ఠానం. మేము అడిగినట్లు 10 శాతం ఇవ్వకపోతే పనులు చేయనివ్వం. డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామగ్రి ఎత్తుకెళ్లిపోతాం” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం.

అధిష్ఠానం రంగంలోకి దిగినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో, ఎమ్మెల్యే బెదిరింపులపై ఎంపీ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఈ ఘటనతో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, కమీషన్ల రాజకీయాలు బహిర్గతమయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క‌మీష‌న్ల కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ ప‌రువును దిగ‌జార్చుతున్నార‌ని టీడీపీ శ్రేణులు మాట్లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment