చిత్తూరు జిల్లా (Chittoor District) వెదురుకుప్పం (Vedurukuppam) మండలం దేవళంపేట (Devalampeta) ప్రధాన కూడలిలో అర్ధరాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar)విగ్రహానికి (Statue) గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు (Fire) పెట్టారు. విగ్రహం దగ్ధమవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
స్థానిక దళిత నేతలు ఈ ఘటనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా టీడీపీ (TDP) నాయకుడు సతీష్ నాయుడు (Satish Naidu) మరియు అతని అనుచరులపై అనుమానం వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు (Dalit Associations) నిరసన చేపట్టాయి. “విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని సర్పంచ్ చొక్కా గోవిందయ్య (Chokka Govindayya) హెచ్చరించారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరించి, శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
అంబేద్కర్ విగ్రహం అవమానానికి గురికావడంతో స్థానిక దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో చిత్తూరు జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.








