హెరిటేజ్ నిర్మాణ సంస్థ‌కు అమ‌రావ‌తి కాంట్రాక్ట్‌.. ఇవిగో ఆధారాలు

హెరిటేజ్ నిర్మాణ సంస్థ‌కు అమ‌రావ‌తి కాంట్రాక్ట్‌.. ఇవిగో ఆధారాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు సరికొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన ‘హెరిటేజ్’ కోసం పనులు చేసిన సంస్థకే, రాజధానిలోని అత్యంత కీలకమైన జీఏడీ (GAD) టవర్ల నిర్మాణ కాంట్రాక్టు దక్కడంపై ప్రతిపక్ష వైసీపీ ‘క్విడ్ ప్రోకో’ ఆరోపణలు గుప్పిస్తోంది.

భీమా ఇన్‌ఫ్రా చుట్టూ వివాదం
హైదరాబాద్‌లో హెరిటేజ్ సంస్థకు చెందిన కొత్త ఐస్‌క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను భీమా ఇన్‌ఫ్రా (Bhima Infra) సంస్థ ఇటీవ‌లే నిర్మించింది. ఈ యూనిట్‌ను తాజాగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రారంభించారు. సీఎం చంద్ర‌బాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ప్రాజెక్టును నిర్మించినట్టు సదరు భీమా ఇన్‌ఫ్రా సంస్థ కూడా అధికారికంగా ప్రకటించుకుంది.

అయితే, అదే సంస్థకు ఇప్పుడు అమరావతిలో కీలకమైన జీఏడీ టవర్ల సబ్-కాంట్రాక్టు దక్కడం గమనార్హం. హెరిటేజ్ నిర్మాణ సంస్థ ఈ టెండ‌ర్‌ను ఎవ‌రి ద్వారా ద‌క్కించుకుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ టవర్లను అత్యాధునిక ‘డయా గ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ సిస్టం’తో నిర్మిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. వ్యక్తిగత వ్యాపార పనులు చేసి పెట్టినందుకే, ప్రభుత్వ ప్రాజెక్టులను కట్టబెట్టారనేది ప్రధానంగా వినిపిస్తున్న‌ విమర్శ.

జ‌గ‌న్ చెప్పిందే జ‌రుగుతుందా..?
ఇటీవ‌ల తాడేప‌ల్లిగూడెం వైసీపీ క్యాడ‌ర్ మీటింగ్‌లో అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల గురించి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తూ.. నిర్మాణ ప‌నుల‌న్నీ చంద్ర‌బాబు బినామీ సంస్థ‌ల‌కే కేటాయిస్తున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ చెప్పిన రెండ్రోజుల్లోనే బీమా సంస్థ‌కు జీఏడీ ప‌నులు కేటాయించిన విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల కేటాయింపుల్లో పార‌ద‌ర్శ‌క‌త‌పై అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

టెండర్ డాక్యుమెంట్లను బహిర్గతం చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని, పారదర్శకత ఉంటే వివరాలన్నీ ప్రజల ముందు ఉంచాలని వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఇటీవల ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న త‌రుణంలో భీమా సంస్థ‌కు రాజ‌ధాని నిర్మాణ ప‌నుల్లో కేటాయింపు అంశం సంచ‌ల‌నంగా మారింది. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఎందుకు అనే ప్ర‌శ్న‌కు దానికి బదులివ్వలేని ప్రభుత్వం.. ఇలాంటి కాంట్రాక్టుల ద్వారా అక్రమాలకు పాల్పడుతోందనే విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంద‌ని వైసీపీ విమర్శిస్తోంది.

ప్రశ్నార్థకంగా టెండర్ల ప్రక్రియ
రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు అయ్యే వ్యయంపై ఇప్పటికే ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హెరిటేజ్ యూనిట్ నిర్మించిన సంస్థే ఇప్పుడు అమరావతి ఐకానిక్ కట్టడాల్లో భాగస్వామి కావడం, ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ పనుల వెనుక ఉన్న అసలు నిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment