సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ తనకు చిన్ననాటి నుంచి తెలుసని, వారిద్దరూ తనతో కలిసి తిరిగారని సీఎం చెప్పిన మాటలు ఆసక్తి రేకెత్తించాయి.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయ్యారు. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, మురళీమోహన్ వంటి పెద్దలతో సహా యువ హీరోలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులకు ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక బ్రాండ్‌గా ఎదగాలని, ఇక్కడి సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, తనకు వ్యక్తిగత ఇష్టాలు లేవన్నారు. తమ ప్రభుత్వం 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నామన్నారు. ఐటీ, ఫార్మా తో తమకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమని తెలిపారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు నిర్మాత దిల్ రాజును ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించామని చెప్పారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చన్నారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలన్నారు. సినిమా పరిశ్రమ సామాజిక అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తూ, గంజాయి, డ్రగ్స్ లాంటి సమస్యలపై అవగాహన కలిగించే చిత్రాలు తీయాలని ఆయన కోరారు.