కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1)ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం నిన్నటి వరకు రూ. 818 కోట్లు వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఇప్పుడు ₹ 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం. ఈ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 31న విడుదల కానుంది.
తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)’కాంతార చాప్టర్ 1′ సినిమాను వీక్షించి, చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, చూస్తూ తాను ట్రాన్స్లోకి వెళ్లిపోయానని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అల్లు అర్జున్ తన ట్వీట్‌లో, “నిన్న రాత్రి #కాంతార చూశాను. వావ్, ఎంత అద్భుతమైన సినిమా. దాన్ని చూస్తూ నేను ట్రాన్స్‌లోకి వెళ్ళాను. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ గారికి అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు.” అని కొనియాడారు.
“రుక్మిణి గారు, జయరామ్ గారు, గుల్షన్ దేవయ్య గారు సహా ఇతర నటీనటుల గురించి తప్పక చెప్పాలి. అలాగే, సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని గురించి, ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్షన్, అరుణ్ రాజ్ స్టంట్స్ టాప్ నాచ్. నిర్మాత విజయ్ కిరంగదూర్, మొత్తం హోంబాలే బృందానికి హృదయపూర్వక అభినందనలు. నిజాయితీగా చెప్పాలంటే, అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు,” అంటూ అల్లు అర్జున్ ‘కాంతార 1’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.








