ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న ఘర్షణలో ప్రముఖ Tollywood హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆయనపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
118(1), 105 సెక్షన్ల కింద కేసు
పోలీసులు అల్లు అర్జున్‌పై BNS 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, అల్లు అర్జున్‌కు 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముంది. BNS 118(1) సెక్షన్ కింద కూడా బన్నీపై కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం, అతనికి ఒక ఏడాది నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
అల్లు అర్జున్ తనపై తీసుకున్న చర్యలను అడ్డుకోలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు లాయర్ కోరారు.
కాగా, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకు ముందు గాంధీ ఆస్పత్రిలో అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు, నాంపల్లి కోర్టు వద్దకు, గాంధీ ఆస్పత్రికి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.








