ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి (IPS Officer), మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారితో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇసుక అక్రమ రవాణా (Sand Illegal Transport)పై ఫిర్యాదు (Complaint) అందిన వెంటనే, ఐపీఎస్ అధికారి అంజలి తన విధిని నిర్వర్తించడానికి చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆమెకు ఫోన్ చేసి, “నేను ఉప ముఖ్యమంత్రిని, మీ చర్యను ఆపండి” అని ఆదేశించారు. దానికి అంజలి స్పందిస్తూ, “ఇది ఇసుక అక్రమ రవాణాపై వచ్చిన ఫిర్యాదు. ఫిర్యాదు స్పందించి చట్టరిత్యా నడుచుకోవడం మా విధి” అని స్పష్టం చేశారు.
అయితే, అజిత్ పవార్ తన మాట వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “చర్యను ఆపమని చెబుతున్నాను. లేకపోతే, నీపై చర్య తీసుకుంటాను” అని బెదిరించారు. దీనికి భయపడకుండా ఐపీఎస్ అంజలి, “మీరు ఉప ముఖ్యమంత్రి అని నాకు ఎలా తెలుస్తుంది? సార్, మీరు కావాలంటే దయచేసి నాకు నేరుగా కాల్ చేయండి” అని బదులిచ్చారు.
అంతే, అజిత్ పవార్ మరింత కోపంతో, “నీకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? నాకు నేరుగా కాల్ చేయమని చెబుతావా? నా ముఖం కూడా గుర్తుపట్టలేదా? నీపై చర్య తీసుకుంటాను” అని మళ్లీ బెదిరించారు. అయితే ఐపీఎస్ అధికారి ధైర్యం, చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఇసుక అక్రమాన్ని ప్రోత్సహించడం ఏంటని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.