కోర్టును అశ్రయించిన ఐశ్వర్యరాయ్

మార్ఫింగ్‌, ఏఐ వీడియోలపై కోర్టును అశ్రయించిన ఐశ్వర్యరాయ్

బాలీవుడ్ అగ్రనటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తన వ్యక్తిగత గోప్యత, ఇమేజ్ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాడకుండా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, త్వరలో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

ఆరోపణలు, ఆధారాలు:

ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు, సంస్థలు ఐశ్వర్య ఫొటోలను మార్ఫింగ్ చేసి, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఎడిట్ చేసి అభ్యంతరకరమైన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆమె ఫొటోలను టీ-షర్టులపై ముద్రించి వ్యాపారం చేస్తున్నారు. ఈ చర్యలన్నీ గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయవాది వాదించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు.

గతంలోనూ ఇలాగే..

ఇలా కోర్టుకు వెళ్ళడం ఐశ్వర్యకు ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. “ఆరాధ్య ఆరోగ్యం విషమంగా ఉంది,” “ఇక లేరు” అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళు నకిలీ వార్తలు ప్రచారం చేయడంతో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అప్పట్లో పిల్లల గోప్యత, ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా ఖండిస్తూ, ఆ కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది.

ఐశ్వర్య తాజా పిటిషన్, సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యత, ఇమేజ్ హక్కుల రక్షణపై మరోసారి విస్తృత చర్చకు దారితీసింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలను వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు సూచించడంతో, ఈ నిర్ణయం సినీ ప్రముఖుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణను 2026 జనవరి 15కి వాయిదా పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment