అభిమాన తారలు బయట కనిపిస్తే ఫ్యాన్స్ అంతా సహజంగా ఫొటోల కోసం ఎగబడతారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ హడావిడి కారణంగా తారలు ఇబ్బందిపడుతుంటారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో నటి రాగిణి ద్వివేది తన అభిమాని చెంపదెబ్బ కొట్టిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఈవెంట్‌లో రాగిణిని ఫోటోల కోసం అభిమానులు చుట్టుముట్టగా, ఓ వ్యక్తి ఆమె చేయిని గట్టిగా లాగాడని రాగిణి తెలిపారు. ఆ సమయంలో అసహనానికి గురైన ఆమె ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు.
ఈ ఘటనపై స్పందించిన రాగిణి, వ్యక్తిగత హద్దులు దాటితే ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రాగిణి ద్వివేది ‘జెండా పై కపిరాజు’ సహా పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఈ సంఘటనపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాగిణి చర్య సరికాదని, మరికొందరు ఆమెను ఇబ్బందికి గురిచేసిన అభిమాని తప్పుడు పని చేసాడని అంటున్నారు.