తన సొంత గ్రామంలో విజయ్ దేవరకొండ కుటుంబం సందడి చేసింది. స్వగ్రామంనాగర్ కర్నూల్ జిల్లాలోని బలమూరు మండలం తుమ్మన్‌పేటలో నిర్మించిన నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన దంపతులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు అన్నదానం చేసి, వారితో సంతోషంగా సమయం గడిపారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. “సొంతూరుతో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. నాన్న ఎప్పుడూ ఊర్లో పొలం కొనాలి, వ్యవసాయం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేవారు. ఆ కోరిక నేడు నెరవేరింది. అదే సమయంలో ఇక్కడే ఇల్లు కట్టుకుని, పెళ్లి జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ఇకపై గ్రామానికి తరచూ వస్తానని, గ్రామంతో తన అనుబంధం మరింత బలపడుతుందని విజయ్ చెప్పారు. తన తమ్ముడు ఆనంద్ పెళ్లిని కూడా గ్రామ ప్రజల సమక్షంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. “ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు.
గ్రామ అభివృద్ధి కోసం దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ స్వగ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో ఆనందాన్ని నింపింది. స్థానికులు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మన్‌పేటలో పండుగ వాతావరణం నెలకొంది.








