ఈనెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవల్ బంద్ (Suspended) కానున్నాయి. పైసలిస్తేనే (Payments) సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (AP Specialty Hospitals Association – ASHA) కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) ప్రతినిధులు మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ (NTR) వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు. అప్పుల భారం మోయలేక, బాధలు భరించలేక ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. ప్రతీ నెలా నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి రూ.330 కోట్ల సేవలు అందిస్తున్నామని చెప్పారు. బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సగం కూడా రావడం లేదన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.3500 కోట్ల వరకూ పేరుకుపోయాయని, దీంతో మందులు, పరికరాలు అప్పులిచ్చే కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయన్నారు. బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. ఆస్పత్రులు వైద్యులకు జీతాలిచ్చే పరిస్థితిలో కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మార్చి 7న నోటీసు పంపిస్తే.. ప్రభుత్వం రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.
తాము ఎప్పుడు డబ్బులు అడిగినా పాత బకాయిలు చెల్లించామనే చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చెల్లించే దానికంటే తాము ఎక్కువగానే సేవలు అందిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. 90 శాతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 3300 ప్యాకేజీలకు సేవలు అందిస్తున్నామని, ప్రతీ నెలా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రుల మనుగడే కష్టంగా మారిందన్నారు. తమ బకాయిల్లో రూ.1500 కోట్లు అత్యవసరంగా చెల్లించాలని, అలా చెల్లించలేని పక్షంలో వైద్య సేవలను అందించే పరిస్థితి లేదని, ప్రభుత్వం కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ (New Insurance Scheme) కు వెళ్లేముందు తమకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించి తీరాలని అల్టిమేటం జారీ చేశారు.