బలూచిస్తాన్‌లో భద్రతా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత, ఆదివారం పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడి జరిగింది. బలూచిస్తాన్‌లోని నోష్కి ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన ఏడు బస్సులు, రెండు కార్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటనలో 90 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని BLA ప్రకటించింది. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఐదుగురు సైనికులు మాత్రమే మరణించారని తెలిపింది.
BLA ప్రకటన ప్రకారం, ఒక బస్సును వాహనంతో నడిచే IED ద్వారా పేల్చారు. ఇది ఆత్మాహుతి దాడి అయ్యే అవకాశముందని పాక్ అధికారులు అంటున్నారు. మరో బస్సును రాకెట్ గ్రెనేడ్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి తర్వాత, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమీప ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
BLA విడుదల చేసిన ప్రకటనలో “మజీద్ బ్రిగేడ్‌కు చెందిన ఆత్మాహుతి దళాలు RCD హైవేపై పాక్ సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపాయి. ఎనిమిది బస్సుల్లో ఒకటి పూర్తిగా నాశనమైంది. ఈ దాడిలో మొత్తం 90 మంది సైనికులు మరణించారు” అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో ఇలాంటి దాడుల సంఖ్య పెరుగుతుండటం పాకిస్తాన్‌కు పెద్ద సవాల్‌గా మారింది.