ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను రోడ్డునపడేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ పరిణామంతో కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది.
ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగియడంతో, ఏ క్షణమైనా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నేడు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదంటూ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యం విధానాలను వారు తీవ్రంగా ఖండించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఇంకా పరిష్కారం కాకముందే, ఇప్పుడు కార్మికుల తొలగింపు నిర్ణయం కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అంశంపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై కూడా కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని కార్మికసంఘాల నాయకులు మండిపడుతున్నారు.








