యూట్యూబ్ (YouTube) లో ఉపయోగకరమైన కంటెంట్ కంటే అనవసరమైన, తప్పుడు సమాచారం ఎక్కువగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్, స్పామ్ వీడియోలు, ఇతర హానికరమైన కంటెంట్ అనేకం యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. కొంతమంది కేవలం వ్యూస్ కోసం అసత్య సమాచారం జోడించి వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఇది పెద్ద సమస్యగా మారడంతో యూట్యూబ్ తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది.
గత 90 రోజుల్లో యూట్యూబ్ దాదాపు 95 లక్షల వీడియోలు, 45 లక్షల ఛానళ్లను తొలగించింది. ఇందులో అత్యధికంగా భారతదేశపు కంటెంట్ పై యాక్షన్ తీసుకున్నది. 30 లక్షల భారతీయ వీడియోలను యూట్యూబ్ తొలగించింది. కేవలం వీడియోలే కాదు, హానికరమైన కామెంట్లను కూడా తొలగించేందుకు యూట్యూబ్ ముందుకొచ్చింది. మొత్తం 1 కోటి 2 లక్షల కామెంట్లను డిలీట్ చేసింది.
యూట్యూబ్ AI సాయంతో ఈ శుభ్రపరిచే ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ముఖ్యంగా పిల్లల భద్రత, తప్పుడు సమాచారం నివారణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 50 లక్షల పిల్లల భద్రతను హానిచేసే వీడియోలను తొలగించింది.