జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు జనసేన పార్టీ సమాచారం పంపించింది. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు.
కాగా, నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడుతున్నట్లుగా టీడీపీ అనుకూల పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నట్లుగా ఆ వార్తలో వెల్లడించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జనసేన పార్టీ కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. టీడీపీ అనుకూల పత్రికలో సీటు లేదని ప్రకటన రావడం, గంటల వ్యవధిలోనే పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.