ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్‌గా కేవలం నాలుగు ఛానళ్లకు శాసనమండలి ఫీడ్ పంపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ నాలుగు ఛానళ్లు కూడా శాసనమండలిలో కొందరు సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు టెలికాస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మండలిలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలు పలు అనుమానాలకు తావిస్తోంది.
బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి. సోమవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లోనూ చర్చ మొదలైంది. మండలిలో ప్రతిపక్ష వైసీపీ బలమే ఎక్కువగా ఉంది. దీంతో కౌన్సిల్ ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ఆంక్షలు విధించింది.
లోకేష్ భయపడ్డారు – వైసీపీ
ఇదిలా ఉండగా, వైసీపీ ఎమ్మెల్సీల దెబ్బకి భయపడ్డ మంత్రి నారా లోకేష్ మీడియాపై ఆంక్షలు విధించినట్లుగా ప్రతిపక్షం ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సమాచార శాఖ లైవ్ ప్రసారాలు నిలిపివేశారని, సాక్షి సహా 4 ఛానళ్లకు మండలి లైవ్ ప్రసారాలు రాకుండా ఆంక్షలు విధించారని విమర్శలు చేస్తోంది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఛానళ్లకు మాత్రమే లైవ్ ప్రసారాల అనుమతి ఇచ్చారని, మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోవడంతో మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు విధించినట్లుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది.