రక్షణ రంగంలో ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకారం తెలపగా, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మాత్రం తిరస్కరించారు. ట్రంప్ ప్రతిపాదన “మంచి ఆలోచన” అని పుతిన్ స్వయంగా వ్యాఖ్యానించారు. మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే, చైనా మాత్రం తన రక్షణ వ్యయం మితమైనదని చెప్పుతూ, ఈ చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది.
చైనా ఎందుకు వెనుకడుగు వేసింది?
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. చైనా సార్వభౌమాధికారాన్ని, భద్రతను కాపాడుకోవడం కోసం మాత్రమే రక్షణ ఖర్చులు పెంచుతోంది అని తెలిపారు. ఏ దేశంతోనూ ఆయుధ పోటీలో పాల్గొనదని స్పష్టం చేశారు. అయితే, చైనా రక్షణ బడ్జెట్ ప్రపంచంలో రెండవ అతిపెద్దదని, 2024 వార్షిక బడ్జెట్లో 7.2% పెరుగుదలతో 236 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అమెరికా తర్వాత అత్యధికంగా రక్షణ ఖర్చు చేస్తున్న దేశం చైనానే కావడం గమనార్హం.
సైనిక ఖర్చులకు అమెరికా 1 ట్రిలియన్ డాలర్లు వెచ్చించాల్సిన అవసరం లేదని ట్రంప్ అని వ్యాఖ్యానించారు. రష్యా, చైనా కూడా సైనిక ఖర్చులను 50 శాతం తగ్గిస్తే ప్రపంచ శాంతి సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు రష్యా ఓకే చెప్పడాన్ని యూరప్, నాటో దేశాలు సానుకూలంగా చూస్తున్నప్పటికీ, చైనా వెనుకడుగు ఎందుకు వేసిందన్నది ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.