ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదం శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్-18 ప్రాంతంలో సంభవించింది. మంటలు వ్యాపించడంతో టెంట్లు పూర్తిగా కాలిపోయాయి. టెంట్లకు మంటలు అంటుకున్న వెంటనే, చుట్టుపక్కల ఉన్న భక్తులను అప్రమత్తం చేసి, ఖాళీ చేయించారు. అయితే గాలి బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కుంభమేళాలోని సెక్టార్ 22లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.








