తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం అందుబాటులో ఉంటుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులు ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేసి సాయం అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా ఈ సాయాన్ని పొందనున్నారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా పథకం నుండి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం కలెక్టర్లకు బాధ్యతగా అప్పగించారు.
గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ధరణి లోపభూయిష్టంగా ఉందని, ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు భూభారతిని అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని వెల్లడించారు. ధరణి స్థానంలో భూభారతి చట్టంను అమలులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. భూభారతి చట్టానికి సంబంధించి మేధావులు, రైతులు, ఉద్యోగులు, పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించిన అనంతరమే ఈ చట్టం రూపొందించారని మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రజా పాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు రావడంతో 72 లక్షల దరఖాస్తులపై సర్వే పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈనెల 26న గ్రామ సభల్లో అర్హులను నిర్ణయించి, రైతు భరోసాతో పాటు తెల్ల రేషన్ కార్డులు, భూమిలేని నిరుపేదల కోసం ఏటా రూ.12 వేల సాయం ప్రారంభిస్తామని ప్రకటించారు.