కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివస్తుంటారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టే, టీటీడీ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. కానీ, గతంలో ఎన్నడూ జరగని విధంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు మృత్యువాత పడ్డారు. టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందగా, 40కి పైగా భక్తులు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనకు కారణం ఎవరు.. పోలీసులా, అధికారులా, పాలకమండలి అలసత్వమా, లేక ప్రభుత్వ వైఫల్యమా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడున్న భక్తులంతా పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపం, భక్తుల ఏర్పాట్ల పట్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ సైతం ప్రభుత్వాధినేత చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడులే తొక్కిసలాట ఘటనకు కారణమని ఆరోపిస్తోంది.
బాబు అధికారంలోకి రాగానే..
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చారని వైసీపీ ఆరోపిస్తోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రాజకీయ ఆరోపణలు మొదలు పెట్టించారని, తిరుమల ఆలయ పవిత్రత, భక్తుల సేవలను చంద్రబాబు గాలికొదిలేసి, ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తూ వైసీపీపైన, వైఎస్ జగన్ మీద బురదజల్లడమే అజెండగా మార్చుకున్నారని విమర్శిస్తున్నారు. గత టీటీడీ చైర్మన్లను లక్ష్యంగా చేసుని అనేక ఆరోపణలు చేస్తూ తిరుమల విశిష్టతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని, వీఐపీలకు పెద్ద పీట వేసి, సామాన్య భక్తుల భద్రతను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చైర్మన్ పై భక్తుల ఆగ్రహం
ఓ టీవీ ఛానల్ యజమానిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని, తిరుమల వేదికగా గత ప్రభుత్వంపై నిందలు వేయడం, రాజకీయాలు మాట్లాడేందుకే బీఆర్ నాయుడుకు సమయం సరిపోతోందని ఆరోపణలు వస్తున్నాయి. పుణ్యక్షేత్రంలో భక్తుల గురించి పట్టించుకోకుండా.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయని హడావిడి చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనే కనీస అవగాహన లేకుండా, అధికారులను అప్రమత్తం చేస్తూ భద్రతా చర్యలు చేపట్టకుండా కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యాడని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. తొక్కిసలాట ఘటన జరిగి భక్తులు చనిపోతే చేసేదేమీ లేదంటూ వ్యాఖ్యానించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా చర్యలేవని ఈవోకు ప్రశ్నలు..
ఎన్నికల్లో లోకేష్‌కు సాయం చేసినందుకు ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు టీటీడీ ఈవో పదవి కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందాడని వైసీపీ అంటోంది. రాజకీయాల మీద దృష్టిపెట్టి పరిపాలన మీద పట్టుకోల్పోతున్నారని, భక్తుల గురించి పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
జేఈవోపై తీవ్ర ఆరోపణలు
వెంకయ్య చౌదరి ప్రస్తుతం జేఈవోగా కొనసాగుతున్నారు. గతంలో చంద్రబాబు ఓఎస్డీగా పనిచేసిన ఈయనను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబే ఏరికోరి వెంకయ్య చౌదరిని తెచ్చుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. టీటీడీని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని నిరంతరం వెంకయ్య చౌదరి పనిచేస్తున్నారని టీటీడీ అధికారులే విమర్శలు చేస్తున్నారు. వెంకయ్య చౌదరి కారణంగా భక్తులకు సౌకర్యాలు, ఆలయ ధార్మిక కార్యక్రమాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
శాంతిభద్రతలను ఎస్పీ గాలికొదిలేశారు..
ప్రస్తుత తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న సుబ్బరాయుడు చంద్రబాబుకు గతంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తెలంగాణ నుంచి తిరుమలకు తెచ్చారు చంద్రబాబు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టగానే వైసీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షపూరిత కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తోంది. భక్తుల, పౌరుల రక్షణ కన్నా రాజకీయ కక్షపూరిత కేసులకే ఎస్పీ సుబ్బరాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.