పర్యావరణ పరిరక్షణపై(Environmental Protection) మాట్లాడటం వేరు.. అధికారంలో ఉండి ప్రకృతిని కాపాడటం వేరు. గతంలో రుషికొండలో(Rushikonda) ప్రభుత్వ భవనాలు (Government Buildings) నిర్మిస్తుంటే హంగామా చేసి పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఇప్పుడు విశాఖలో(Visakhapatnam) కొండల విధ్వంసంపై(Hill Destruction) ఎందుకు నోరు మెదపడం లేదు? కొండల తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? వాటికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుంటే సంబంధిత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
అభివృద్ధి అంటే ఉన్న ప్రకృతి సంపదను (Natural Resources) ధ్వంసం చేయడం కాదు. భావితరాలకు ఆ సంపదను భద్రంగా అందించడం. పర్యావరణ శాఖ మంత్రిగా విశాఖ కొండల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పవన్ కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పర్యావరణ శాఖ మంత్రిగా ఎందుకీ మౌనం?
ఓ వైపు అభివృద్ధి పేరుతో ప్రచారం.. మరోవైపు ప్రకృతి విధ్వంసం! పచ్చని కొండలు, సుందరమైన సముద్ర తీరంతో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖపట్నంలో పర్యావరణ విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎనిమిదికి పైగా కొండలను ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. గతంలో రుషికొండపై ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని(Government Building Construction) తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ కొండల విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నిబంధనల ప్రకారమే.. పర్యావరణ అనుమతులతో నిర్దిష్ట డిజైన్ తో రుషికొండపై ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ప్రకృతి విధ్వంసం జరుగుతోందంటూ పవన్ కల్యాణ్ నానా హంగామా చేశారు. వాస్తవానికి రుషికొండపై జగన్ ప్రభుత్వం (YS Jagan Government) కొత్తగా ఏమీ భవనాలు కట్టలేదు..గతంలో ఉన్న భవనాలు తొలగించి వాటి స్థానంలో ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ నైపుణ్యంతో విశాఖకే తలమాణికంగా నిలిచే భవనాల సముదాయాన్ని నిర్మించింది. కానీ నాడు..పవన్ పర్యావరణ పరిరక్షణపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్.. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న కొండల తవ్వకాలపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
విశాఖలో ప్రకృతి విధ్వంసం, కొండల తవ్వకాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పవన్ కల్యాణ్ తీరును ప్రశ్నిస్తున్నారు. కొండల తవ్వకాల వెనుక ఉన్న మాఫియాను ఎందుకు అరికట్టడం లేదని పర్యావరణ ప్రేమికులు నిలదీస్తున్నారు. తన శాఖ పరిధిలోనే జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించలేకపోతే పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలకు అర్థమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై రిటైర్డ్ ఉన్నతాధికారి పీవీ రమేష్ కుమార్ (PV Ramesh Kumar) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన, అపార జీవవైవిధ్యానికి నిలయమైన ప్రాంతాన్ని చెక్కుచెదరకుండా కాపాడాల్సింది పోయి ప్రభుత్వం ధ్వంసం చేయడం హృదయవిదారకమని పేర్కొన్నారు. వ్యక్తిగత ఖజానాలను నింపుకోవాలనే దురాశతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) అభివృద్ధి చేయడం లేదని, వ్యవస్థబద్ధంగా ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జర్నలిస్టులు, ఉన్నతాధికారులు, సినీ తారలు సైతం గొంతు విప్పుతున్నారు. కొండల తవ్వకాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిపోయి టీడీపీ(TDP), జనసేన(Jana Sena) మద్దతుదారులు వారిపై వ్యక్తిగత దూషణలకు, అసభ్యకరమైన ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ప్రకృతిని కాపాడాలని కోరడం కూడా తప్పేనా? పర్యావరణ పరిరక్షణకు గొంతెత్తిన వారిపై వ్యక్తిగత దాడులు చేయడం ఏ సంస్కృతికి నిదర్శనం?








