మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీడ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ, జార్జియా వోల్ (39) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అనంతరం ఎల్లీస్ పెర్రీ 48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. చివర్లో నికోలా క్యారీ 13 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో ఆస్ట్రేలియా పాకిస్థాన్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. మునీబా అలీ (32), కెప్టెన్ ఫాతిమా సనా (17) మినహా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో పాకిస్థాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌటై 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో 71 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన ఎల్లీస్ పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా నాలుగో గెలుపుతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకోగా, వరుస ఓటములతో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత మహిళల జట్టుతో తలపడనుంది.








