మత్స్యకారులను కాపాడబోయి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌..

మత్స్యకారులను కాపాడబోయి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌..

Summarize with AI

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. చెరువు నీటి ప్రవాహంలో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకోగా, వారిని కాపాడేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ముందుగా ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

మిగిలిన ఐదుగురు మత్స్యకారులను రక్షించేందుకు సిబ్బంది మరోసారి చెరువులోకి వెళ్లిన సమయంలో అలుగు (మత్తడి) నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. దీంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బోట్లు అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెండు బోట్లలో కలిపి 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ సిబ్బందే ప్రమాదంలో చిక్కుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

మరోవైపు నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నీటిలో కొట్టుకుపోయిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు మిగిలిన ఐదుగురు మత్స్యకారులను రక్షించేందుకు అధికారులు మరో బోటుతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment