ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో పెట్రోలు బాంబుల దాడులు కలకలం సృష్టించాయి. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పెట్రోలు బాంబులతో దాడులు జరిగినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే టీడీపీ వర్గీయులు ఈ దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. మరోవైపు వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పోలింగ్ కేంద్రాల సమీపంలో పెట్రోలు బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలతో రెండు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2,61,52,377 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 9,966 సమస్యాత్మక, 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దాదాపు 38 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
పులివెందులలో వరుస ఘటనలు
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి దాడులు, అడ్డగింతలపై ఫిర్యాదులు అందాయి. లింగాల మండలం పార్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకొని, వారి పత్రాలు చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దొండ్లవాగులో స్థానికేతరులు కర్రలు, రాడ్లతో వచ్చి పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వేముల జడ్పీ హైస్కూల్ వద్ద ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకున్నట్లు సమాచారం. ఆర్.తుమ్మలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణారెడ్డిపై రాళ్లు, సీసాలతో దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. ఎర్రిపల్లి, ఈ కొత్తపల్లి, మోటునూతలపల్లి, అరసవల్లి ప్రాంతాల్లో ఓటర్లను అడ్డుకోవడం, లాఠీఛార్జి ఘటనలపై ఫిర్యాదులు వచ్చాయి. లింగాలలో విలేకరి పుల్లారెడ్డిపై దాడి జరిగి, ఆయన సెల్ఫోన్ ధ్వంసమైనట్లు సమాచారం.








