ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంటే ప్రజాక్షేత్రంలో అభ్యర్థుల బలాబలాలు, రాజకీయ వ్యూహాలు, ప్రచార హోరు, ప్రజాదరణ ప్రాతిపదికన తుది తీర్పు వెలువడాలి. కానీ, తిరుపతి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సరికొత్త వింత ట్రెండ్‌కు తెరతీశారు.
ఓటర్ల తీర్పును, అభ్యర్థుల అర్హతలను పక్కనబెట్టి.. అదృష్ట దేవత ఎవరిని కరుణిస్తే వారికే టికెట్ అంటూ గాలిలో నాణెం వేసి బొమ్మా-బొరుసు ఆటతో అభ్యర్థిని ఖరారు చేసిన విచిత్ర రాజకీయ నాటకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిత్వం కోసం పార్టీలో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ స్థానం కోసం ఏకంగా ఐదుగురు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ నేతలు తీవ్ర తర్జనభర్జన పడ్డారు. నాయకుల సంప్రదింపులతో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి అంగీకరించినప్పటికీ, బరిలో చివరికి కుమ్మర కౌసల్య, జిల్లా సౌందర్య మాత్రమే మిగిలారు.
సాధారణంగా కూటమి రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం నియోజకవర్గ స్థాయిలో సుదీర్ఘ చర్చలు, ప్రజాభిప్రాయ సర్వేలు, క్యాడర్ బలాబలాలు లెక్కిస్తారు. కానీ ఇక్కడ ఇరువర్గాలు పట్టు వీడకపోవడంతో పార్టీ పెద్దలు ఓ కొత్త ‘ప్లాన్’ అమలు చేశారు.
అభ్యర్థికి ప్రజల్లో ఉన్న ప్రజాదరణ వంటి ప్రాథమిక అర్హతలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. పార్టీ పెద్దల సమక్షంలో నేరుగా టాస్ (Coin Toss) వేశారు. గాలిలో నాణెం వేయగా ‘బొమ్మ’ పడటంతో కుమ్మర కౌసల్యను విజేతగా ప్రకటించి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా ఆమెకు బీ-ఫారమ్ అందజేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల ఎంపికను ఇలా నాణెం తిప్పి లక్ ఆధారంగా తేల్చేయడంపై స్థానిక ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయికి దిగజార్చారో ఈ ‘టాస్ పాలిటిక్స్’ అద్దం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








