జియో ప్లాట్‌ఫారమ్స్ స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేసిన సందర్భంగా అంబానీ కుటుంబంలో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. ఈ వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ప్రసంగిస్తుండగా కంటతడి పెట్టుకున్నారు. జియో ప్రయాణం, సంస్థ వెనుక ఉన్న జ్ఞాపకాలను పిల్లలు గుర్తుచేసుకోవడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
వేదికపై అనంత్ అంబానీ మాట్లాడుతూ.. జియోకు దేశవ్యాప్తంగా ప్రజల ఆశీర్వాదాలు, ఆదరణ లభించాయని పేర్కొన్నారు. ఈ కలకు తన సోదరి ఈశా అంబానీ బీజం వేస్తే, సోదరుడు ఆకాశ్ అంబానీ దాన్ని తన సొంత కలగా మార్చుకున్నారని చెప్పారు. తన తల్లి జియోను ప్రేమగా ‘నా లాలా’ అని పిలిచేవారని, నాయనమ్మ ‘జుగ్ జుగ్ జియో’ అంటూ ఆశీర్వదించేవారని గుర్తుచేశారు. స్నేహితులు ‘జియో యార్’ అని పిలిచేవారని చెబుతూ, నిజానికి జియోను సృష్టించింది దేశ ప్రజలేనని అనంత్ అన్నారు. ప్రజల కలలను సాకారం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మాటలు వింటున్న ముఖేష్ అంబానీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.
ఈ వేడుకలో రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశా అంబానీ ప్రసంగం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జియో విజయానికి కృషి చేసిన బృందానికి, తన సోదరులకు, తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులు ఊహించలేని భవిష్యత్తును తన తండ్రి ముఖేష్ అంబానీ ముందుగానే అంచనా వేశారని, అసాధ్యమనుకున్న లక్ష్యాలను సాధించే ధైర్యం ఆయన చూపించారని కొనియాడారు. ఆయన దూరదృష్టి కోట్లాది మంది భారతీయులకు కొత్త అవకాశాలను పరిచయం చేసిందని పేర్కొన్న ఈశా.. జియో ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని అన్నారు. తన సోదరుడు ఆకాశ్ అంబానీ గత 13 ఏళ్లుగా జియో ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాతే ఇంటికి చేరుకునేంతగా ఆయన సంస్థ కోసం శ్రమించారని చెబుతూ, ఆకాశ్‌కు చెల్లెలిగా ఉండటం తనకు గర్వకారణమని ఈశా పేర్కొన్నారు. వ్యాపార విజయాల మధ్య కుటుంబ అనుబంధం, పరస్పర గౌరవం ప్రతిబింబించిన ఈ వేడుకకు సంబంధించిన భావోద్వేగ దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.








