రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఛేదన.. నలుగురు నేపాలీ ముఠా సభ్యుల అరెస్ట్

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఛేదన.. నలుగురు నేపాలీ ముఠా సభ్యుల అరెస్ట్

Summarize with AI

హైదరాబాద్‌: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్ హత్య, దోపిడీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సిట్‌, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన నలుగురు నిందితులను నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.51,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మే 7, 8 తేదీల మధ్య రాత్రి ప్రశాసన్ నగర్‌లో తనుజా రంజన్ హత్యకు గురికాగా, దుండగులు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

పక్కా ప్రణాళికతో హత్య, దోపిడీ
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ధర్మ అలియాస్ కల్పన ముఠా సభ్యులతో కలిసి ఈ నేరానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. యజమానుల ఇంట్లోని విలువైన వస్తువుల వివరాలను ముఠాకు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. యజమాని ఇంట్లో లేని సమయంలో ముఠా సభ్యులు లోపలికి ప్రవేశించి, నిద్రిస్తున్న తనుజా రంజన్‌ను నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం సుమారు 225 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పలు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందం, భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా పెట్టింది. సాంకేతిక ఆధారాలతో నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుల ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేసింది.


అరెస్టయిన వారిలో ధర్మ తిరువా అలియాస్ కల్పన (26), గణేష్ బి.కె. అలియాస్ దినేష్ థాపా (31), చంద్ర బహదూర్ తమంగ్ అలియాస్ శంకర్ చంద్ర లామా (44), గణేష్ బహదూర్ షాహి (37) ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాత కేసులకు సంబంధించి ఐదు నాన్‌-బెయిలబుల్ వారెంట్లను అమలు చేయడంతో పాటు, పలు నగరాల్లో భారీ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జీవన్ చంద్ అలియాస్ జీబన్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ముఠా సభ్యులు ప్రణాళిక చేసిన మరికొన్ని నేరాలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఇళ్లలో పనిమనుషులు, వంటవారు, వాచ్‌మెన్లను నియమించుకునే సమయంలో వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి, తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment