భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చేపట్టింది. మాజీ భారత స్పిన్నర్ రమేశ్ పవార్‌ను సెలక్షన్ కమిటీ సభ్యుడిగా నియమించింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రమేశ్ పవార్‌ను ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. భారత జట్టు తరఫున ఆయన రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడారు. అనంతరం భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా, ముంబై, గుజరాత్ జట్లకు కోచ్‌గా, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా సేవలందించారు. మహిళల జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో ఆసియా కప్ టైటిల్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. టెస్టు మ్యాచ్‌ల్లో ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిగా సీనియారిటీ ప్రాతిపదికన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా ఛైర్మన్‌గా, శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేశ్ పవార్ సభ్యులుగా కొనసాగనున్నారు. 2023 జూలైలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ సేవలను BCCI ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆయన పదవీకాలంలో భారత జట్టు మూడు ICC ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు, వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించినట్లు బోర్డు పేర్కొంది.








