మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్‌..

మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్‌..

Summarize with AI

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రాయ్‌ భార్య తనూజా రంజన్‌ హత్య, దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న కల్పన అలియాస్‌ ధర్మతో పాటు మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన అనంతరం నేపాల్‌కు పారిపోయిన నిందితులు.. మరో దోపిడీకి ప్రణాళిక వేసుకుని తిరిగి భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రశాసన్‌నగర్‌లో నివసించే తనూజా రంజన్‌ను ఇంట్లో పనిచేసే కల్పన అలియాస్‌ ధర్మ, సురేష్‌ షాహి అలియాస్‌ సృజన్‌ షాహి, గణేష్‌ బికాస్‌, కంచ లామాతో పాటు మరో ముగ్గురు కలిసి పథకం ప్రకారం హత్య చేసి, ఇంట్లోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మే 8న జరిగిన ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు నేపాల్‌కు పారిపోవడంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇటీవల మరో దోపిడీకి ప్రణాళిక వేసుకున్న నిందితులు కల్పనతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, నలుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు, మరో ముగ్గురు నేపాల్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు, దోపిడీకి గురైన బంగారు ఆభరణాల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్‌కు చెందిన సునీల్‌ పరియార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, మిగిలిన నిందితుల ఆచూకీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment