కొచ్చి ఎయిర్‌పోర్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన సత్యనారాయణకు ఆ మాదకద్రవ్యాలతో ఎలాంటి సంబంధం లేదని, తన లగేజీ నిండిపోవడంతో ఆ వస్తువులను సత్యనారాయణ బ్యాగులో పెట్టించింది తానేనని స్వయంగా తోటి ప్రయాణికుడు అరుణ్‌కుమార్ న్యాయస్థానానికి స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన ఎన్డీపీఎస్ (NDPS) కోర్టుకు రాసిన లేఖ ప్రస్తుతం రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా సత్యనారాయణపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి తెగబడిందని ఈ లేఖ ద్వారా మరోసారి స్పష్టమైంది.
సత్యనారాయణ బ్యాగులో వస్తువులు పెట్టింది నేనే
తన సొంత లగేజీ పూర్తిగా నిండిపోవడంతో, కొన్ని వస్తువులను సత్యనారాయణ లగేజీ బ్యాగులో సర్దాలని తానే కోరినట్లు అరుణ్‌కుమార్ తన లేఖలో స్పష్టంగా వెల్లడించారు. ఆ వస్తువులను సత్యనారాయణకు తానే స్వయంగా ఇచ్చినట్లు పేర్కొంటూ, “I give to Satyanarayana keep in luggage because my luggage is full” అని అందులో రాశారు.
ఈ వ్యవహారం గురించి సత్యబాబు కుమారుడు సత్యనారాయణకు కనీస సమాచారం కూడా లేదని అరుణ్‌కుమార్ కుండబద్దలు కొట్టారు. “Mr. Satyanarayana S/O Sathya Babu don’t know anything” అని లేఖలో పేర్కొంటూ, అసలు ఆ వస్తువుల్లో నిషేధిత పదార్థాలు ఉన్న విషయం తనకు కూడా తొలుత తెలియదని స్పష్టం చేశారు.
బ్యాంకాక్‌కు సత్యనారాయణను తీసుకెళ్లింది నేనే!
సత్యనారాయణను బ్యాంకాక్‌కు రావాలని తానే స్వయంగా ఆహ్వానించినట్లు అరుణ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా, వారిద్దరి విమాన టికెట్లు, వసతి (Accommodation) ఏర్పాట్లను తన కంపెనీయే పూర్తిగా స్పాన్సర్ చేసిందని వెల్లడించారు. సత్యనారాయణ కేవలం బ్యాంకాక్‌లోని పర్యాటక ప్రదేశాలను చూసి ఆస్వాదించేందుకే తనతో పాటు వచ్చారని తేల్చిచెప్పారు.
ఆ వివాదాస్పద వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా అరుణ్‌కుమార్ పూసగుచ్చినట్లు వివరించారు. ఘానాలోని తన స్నేహితుడి అభ్యర్థన మేరకు కొన్ని సబ్బులు, ప్రొటీన్ల పేరుతో ఆ వస్తువులను తీసుకున్నానని.. వాటిని తన బ్యాగులో స్థలం లేకపోవడంతో సత్యనారాయణ బ్యాగులో పెట్టించానని పేర్కొన్నారు. కొచ్చి విమానాశ్రయంలో తనిఖీల సమయంలో వాటిలో మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలడంతో తామిద్దరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు.
ఈ మొత్తం ఉదంతంలో సత్యనారాయణ పూర్తిగా నిరపరాధి అని, ఆయనకు ఎలాంటి నేరపూరిత సంబంధాలు లేవని అరుణ్‌కుమార్ పునరుద్ఘాటించారు. ఆయనకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎన్డీపీఎస్ (NDPS) కోర్టుకు ఆయన అధికారికంగా విజ్ఞప్తి చేశారు.
టీడీపీ మీడియా కుట్రలు మరోసారి బట్టబయలు!
సహప్రయాణికుడు అరుణ్‌కుమార్ కోర్టుకు రాసిన ఈ లేఖతో అసలు నిజాలు వెలుగులోకి రావడంతో.. నిరాధార వార్తలతో వైయస్ఆర్సీపీ నేతలను, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు మరోసారి పటాపంచలయ్యాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేలా తప్పుడు కథనాలు అల్లిన పచ్చ మీడితి బండారం బట్టబయలైందని ప్రజలు మండిపడుతున్నారు.








