స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా, కూటమి ప్రభుత్వ ప్రాయోజిత అరాచక పర్వంగా సాగుతున్నాయనడానికి నిదర్శనాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా నిరోధించడం, అధికారులు – పోలీసులు కుమ్మక్కై నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు వందల సంఖ్యలో వెలుగుచూశాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అనుసరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రమైన నిష్పాక్షికతా రాహిత్యాన్ని, ఏకపక్ష వైఖరిని ఎత్తిచూపుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మైదుకూరు మున్సిపాలిటీలో అక్టోబర్ 17న నామినేషన్ల కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 18 మంది అభ్యర్థులకు చెందిన 19 నామినేషన్ పత్రాలను చించివేశారనే నెపంతో, జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా అక్కడ మాత్రమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. మరి రాష్ట్రంలోని మిగతా వందలాది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న వినిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల (RO) చేతుల్లోని నామినేషన్ పత్రాలను టీడీపీ మూకలు లాక్కొని చించేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా వైరల్ అయ్యాయి.
ప్రతిపక్ష అభ్యర్థులు, ముఖ్యంగా వైయస్ఆర్సీపీ నేతలు నామినేషన్లు వేయడానికి వస్తే వారిని పోలీసు స్టేషన్ల ముందే కట్టడి చేయడం, అభ్యర్థులు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా బయటకు నెట్టివేయడం లాంటి దృశ్యాలు ప్రతి సెల్‌ఫోన్‌కు చేరాయి. అయినా, మైదుకూరు ఎన్నికను మాత్రమే రద్దు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
అధికార దుర్వినియోగానికి ఎస్ఈసీ మద్దతా?
పోలీసు బందోబస్తు, సీసీటీవీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉన్నప్పటికీ నామినేషన్ పత్రాలు ధ్వంసమయ్యాయని కమిషన్ ఒప్పుకుంటోంది. మరి భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడానికి, టీడీపీ మూకలకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది.
అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నామినేషన్ పత్రాలను చించివేసి, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం పక్కా స్కెచ్ వేసినా… ప్రతిపక్షాలు వేల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా, ప్రత్యక్ష ఆధారాలు కళ్లముందుంచినా పట్టించుకోని ఎన్నికల కమిషన్.. కేవలం ఒకే ఒక్క చోట ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసి, తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు రంగు పూసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.








