బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక ఐఏఎస్ అధికారి పబ్‌లో రెచ్చిపోయారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న పోలీసులపైనే దూషణలకు దిగి, దాడికి యత్నించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన ‘కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో ఈ అరాచకానికి పాల్పడ్డారు.
అసలు ఏం జరిగింది?
బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ఒక పబ్‌లో అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మత్తులో ఉన్నారు. తనిఖీలు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులను చూసి ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఒక ఐఏఎస్ అధికారినంటూ అహంకారంతో ఊగిపోయిన వికాస్ మర్మత్, విధుల్లో ఉన్న పోలీసులను అత్యంత అసభ్య పదజాలంతో దూషించారు. గొడవను సర్దుబాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వినకుండా, సిబ్బందిపైకి దూసుకెళ్తూ దాడికి యత్నించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై రంగంలోకి దిగిన బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై దాడికి యత్నించడం వంటి అభియోగాల కింద ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు మరో ముగ్గురు (అభయ్ ఉదయ్ సింగ్, నితీశ్, రోషన్) పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారి ఇలా పరరాష్ట్రంలో పబ్‌లో వీరంగం సృష్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సీఎం చంద్రబాబుతో వికాస్ మర్మత్ ఉన్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ అంశం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పబ్ లో ఏపీ ఐఏఎస్ అధికారి వీరంగంమద్యం మత్తులో పోలీసులపై దూషణలు, దాడికి యత్నంకుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పీడీగా ఉన్న వికాస్ మర్మత్ఐఏఎస్ వికాస్ పై బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు https://t.co/80Ff6Y8Llr
— Telugu Feed (@Telugufeedsite) October 13, 2026








