ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh)ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, విధివిధానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా(Anil Chandra Punetha) అధికారికంగా వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
మూడు దశల్లో పంచాయతీలు..
రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు వేర్వేరుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఎస్ఈసీ (SEC) ప్రణాళిక రూపొందించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇవి పూర్తిగా పార్టీ రహితంగా జరగనున్నాయి. గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
మున్సిపాలిటీలు(Municipalities), నగరపాలక సంస్థలు(Municipal Corporations), నగర పంచాయతీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన 16 రోజుల్లో ఈ ఎన్నికలు పూర్తి కానుండగా, పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఎన్నికల కోడ్, భారీ ఏర్పాట్లు
ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్.. ఏది ముందు వెలువడితే ఆ క్షణం నుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) తక్షణమే అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ (Telangana) నుంచి అదనంగా 17,650 బ్యాలెట్ బాక్సులను రప్పించారు.
ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించనుంది.








