డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌‌.. మూవీ రివ్యూ

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌‌.. మూవీ రివ్యూ

Summarize with AI

సినిమా : డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌‌
నటీనటులు: ఫహాద్‌ ఫాజిల్‌, బేబీ సారా (సారా పాలేకర్), మహేశ్‌ మంజ్రేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవ్‌, వెంకటేష్ కాకుమాను, సుబ్బరాజు, శశాంక్, విమలా రామన్ తదితరులు.
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్
నిర్మాతలు: ఎస్‌.ఎస్‌. కార్తికేయ, శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
రచన – దర్శకత్వం: శశాంక్‌ ఏలేటి
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2026

మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌కు విభిన్నమైన కథలు, విలక్షణమైన నటనతో తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్ అండ్ ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణంలో ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ ఎమోషనల్ డ్రామా నేడు (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ
సూరి (ఫహాద్‌ ఫాజిల్‌) ఒక అనాథ. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూనే, ఈజీ మనీ కోసం తన స్నేహితుడు (వెంకటేష్ కాకుమాను)తో కలిసి చిల్లర దొంగతనాలు, బెట్టింగ్స్‌ కాస్తుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా డాన్ అస్లాం భాయ్‌ని (మహేశ్‌ మంజ్రేకర్‌) మోసం చేసి పందెంలో గెలుస్తాడు. విషయం తెలుసుకున్న అస్లాం భాయ్, రెండు నెలల్లో రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తాడు.

ఆ డబ్బు సంపాదించడానికి సూరి ఓ స్కూల్ బయట పిల్లలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలోనే సూరికి బేబీ దివ్య (సారా పాలేకర్) పరిచయం అవుతుంది. తన అమ్మానాన్నలను మ్యాజిక్ చేసి మాయం చేశానని నమ్మే దివ్యతో సూరి ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలోనే దివ్య మనిషి కాదని, ఒక ఆత్మ అని సూరి తెలుసుకుంటాడు. అసలు దివ్య నేపథ్యం ఏమిటి? ఆమె సూరికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దివ్యకు ఉన్న స్పెషల్ పవర్స్‌ను సూరి ఎలా వాడుకున్నాడు? తన అమ్మానాన్నలతో దివ్యను కలిపే క్రమంలో సూరికి ఎదురైన ఇబ్బందులేంటి? చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ
‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ ఒక చందమామ కథలా అనిపిస్తుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక చిన్నారి ఆత్మగా మారి, తన అమ్మానాన్నల కోసం వెతుక్కోవడం అనే పాయింట్‌పై ఈ సినిమా నడుస్తుంది. ఆ పాప కేవలం హీరోకి మాత్రమే కనిపిస్తుందనే లాజిక్‌ను దర్శకుడు ఆసక్తికరంగానే రాసుకున్నాడు.

సినిమా మొదటి 15 నిమిషాలు సూరి పాత్ర స్వభావాన్ని, డబ్బు కోసం అతను చేసే పనులను ఎస్టాబ్లిష్ చేస్తూ సాగుతుంది. విలన్ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత పాప ఎంట్రీతో కథనం మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సమయానికి పాప మనిషి కాదు ఆత్మ అనే నిజం హీరోకి తెలియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

ద్వితీయార్థంలో అసలు కథ ప్రారంభమైనప్పటికీ, కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు ప్రతీ విషయాన్ని చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేయడంతో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా హీరోకి, పాపకు మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడే ఘట్టాలను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా గ్రాఫ్ వేరేలా ఉండేది. అయితే, అక్కడక్కడ వచ్చే కామెడీ, ఫహద్ ఫాజిల్ మార్క్ యాక్టింగ్, ఆఖరి 15 నిమిషాల క్లైమాక్స్ ఎమోషన్ మరియు చివర్లో వచ్చే ట్విస్ట్ సినిమాను నిలబెట్టాయి.

నటీనటుల పనితీరు
ఫహాద్ ఫాజిల్ తనదైన సహజ నటనతో సూరి పాత్రలో జీవించేశారు. ఒకవైపు కామెడీ పండిస్తూనే, చివర్లో ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. చిన్నారి దివ్య పాత్రలో బేబీ సారా (సారా పాలేకర్) అమాయకపు మాటలు, చూపులతో ఆకట్టుకుంది. సినిమా అంతా ఈ పాప చుట్టూనే తిరుగుతుంది. హీరో ఫ్రెండ్‌గా వెంకటేష్ కాకుమాను మంచి టైమింగ్ ఉన్న కామెడీ అందించాడు. విలన్‌గా మహేష్ మంజ్రేకర్, ఇతర సహాయక పాత్రల్లో సౌరభ్ సచ్‌దేవ, సుబ్బరాజు, శశాంక్, విమలా రామన్ తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక వర్గం
బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మెరుగ్గా ఉన్నాయి. ఆర్కా మీడియా వర్క్స్ అండ్ ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అయితే ఎడిటర్ ప్రవీణ్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. 2 గంటల 38 నిమిషాల నిడివి సినిమాకు కొంత మైనస్‌గా మారింది. దర్శకుడు శశాంక్ ఏలేటి ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లేను మరింత వేగంగా, ఎమోషనల్‌గా తీర్చిదిద్ది ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.

రేటింగ్ : 2/5

Join WhatsApp

Join Now

Leave a Comment