సినిమాపై అభిమానం ఉండటం వేరు.. ఆ అభిమానాన్నే లక్ష్యంగా మార్చుకుని కలను సాకారం చేసుకోవడం వేరు. ‘అనకాపల్లి’ చిత్ర సహ నిర్మాత నాయుడు ప్రయాణం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు వీరాభిమానిగా ఉన్న నాయుడు.. ఒకప్పుడు సాధారణ సినీ ప్రేక్షకుడిగా థియేటర్‌కు వెళ్లి టికెట్ దొరకకపోవడంతో, ఏదో ఒకరోజు అదే థియేటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో కష్టపడి ముందుకు సాగి ఎగ్జిబిటర్‌గా, థియేటర్ యజమానిగా ఎదిగిన ఆయన.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా సమయంలో మొదలైన ఆ సంకల్పం.. నేడు తాను నిర్మించిన సినిమాను తన సొంత థియేటర్‌లో ప్రదర్శించుకునే స్థాయికి తీసుకెళ్లింది.
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించి కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన ‘అనకాపల్లి’ చిత్రానికి నాయుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు టికెట్ కోసం థియేటర్ ముందు నిలబడిన అభిమాని.. అదే థియేటర్‌కు యజమానిగా మారి, చివరకు తానే నిర్మించిన సినిమాను అక్కడే విడుదల చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. నాయుడు కథ సినీ అభిమానుల్లోనే కాకుండా, తమ కలలను నిజం చేసుకోవాలని ప్రయత్నించే యువతలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.








