పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేతన్‌ను అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి లోహగఢ్ కోటపై నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా ఈ కేసులో మూడో వ్యక్తిగా భావిస్తున్న చేతన్ స్నేహితుడు రితేష్ హింగేను పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన రితేష్‌కు హత్య కుట్ర గురించి ముందే తెలుసని, చేతన్ తన ప్రణాళికలను ఎప్పటికప్పుడు అతడితో పంచుకున్నట్లు పూణే ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. రితేష్ పాత్రకు సంబంధించి వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా కేతన్‌ను తొలుత కిరాయి హంతకుడితో హత్య చేయించాలని చేతన్, సియా భావించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ తర్వాత తామే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. కేతన్కు తీవ్రమైన గాయం చేయడం లేదా అతడి శరీరంలోని ఏదైనా భాగానికి నష్టం కలిగించడం ద్వారా సియాతో జరగబోయే వివాహాన్ని అడ్డుకోవచ్చని నిందితులు భావించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. హత్యకు ముందు రితేష్ లోహగఢ్ కోటను సందర్శించాడా? లేదా? అనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, కేసులో డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి. నిందితుల మధ్య జరిగినట్లు భావిస్తున్న కొన్ని తొలగించిన వాట్సాప్ చాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, వారి కదలికలు, కుట్రలో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. డిజిటల్, సాంకేతిక ఆధారాల విశ్లేషణ పూర్తయిన తర్వాత కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.








