ఏపీలో మెగా డీఎస్సీ-2025 నియామకాలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అధికారులు మీడియా ముందుకు వచ్చారు. అయితే మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన వివరణలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ వైస్ చైర్మన్ ఎస్.భరణి మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వారు పేర్కొంటూనే.. రిపోర్టర్లు లేవనెత్తిన ప్రశ్నలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభాకర్ టెట్ మార్కులపై క్లారిటీ ఏది..?
కర్నూలుకు చెందిన ఈడిగ ప్రభాకర్ నియామకంపై ప్రధానంగా ప్రశ్నలు వస్తున్నాయి. డీఈవో రికార్డుల్లో ప్రభాకర్ టెట్ అర్హత సాధించలేదని, అందుబాటులో ఉన్న హాల్‌టికెట్ నంబర్లలో 65 మార్కులకు మించి కనిపించలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ 77 మార్కులతో టెట్‌లో అర్హత సాధించారని ఎలా చెబుతున్నారని ప్రశ్నించగా.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్సారియా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో రికార్డుల్లో 65 మార్కులకు మించి కనిపించని అభ్యర్థికి 77 మార్కులు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం క్లారిటీ కొరవడిందనే చర్చ మొదలైంది.
2009 ఖొఖో టోర్నమెంట్.. ఇద్దరికి ఉద్యోగాలా?
ఇదే సమయంలో 2009లో జరిగినట్లు పేర్కొన్న ఖొఖో టోర్నమెంట్‌కు సంబంధించి మరో అంశాన్ని మీడియా ప్రస్తావించింది. ఆ టోర్నమెంట్‌కు ఇద్దరు అన్నాచెల్లెళ్లు హాజరుకాలేదని సంబంధిత అసోసియేషన్ రాతపూర్వకంగా ఇచ్చిందని, అయినప్పటికీ వారికి ఉద్యోగాలు లభించాయని ప్రశ్నించారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలిస్తామని శాప్ వైస్ చైర్మన్ ఎస్.భరణి సమాధానమిచ్చారు. అలాగే యోగేశ్వరరావు అనే వ్యక్తి టెట్‌లో అర్హత సాధించకపోయినా ఉద్యోగం పొందారనే ఆరోపణపై కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ప్రశ్నించగా.. వెరిఫై చేస్తామని ఆమె తెలిపారు.
అసోసియేషన్ సర్టిఫికెట్లే ప్రామాణికమా?
స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల అర్హతలకు సంబంధించి అసోసియేషన్ గుర్తింపు, సర్టిఫికెట్ల జారీ విధానం, ధ్రువీకరణ వంటి అంశాలపై మీడియా పలు ప్రశ్నలు సంధించింది. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఓ అసోసియేషన్‌కు గుర్తింపు లేదని, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ధ్రువీకరణ లేఖపై సెక్రటరీ సంతకం చేయాల్సి ఉన్నప్పటికీ కూన రవికుమార్ సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
దీనిపై భరణి స్పందిస్తూ.. కూన రవికుమార్‌ను తాము ఎమ్మెల్యేగా కాకుండా అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని సంబంధిత ఫెడరేషన్ సూచించిందని పేర్కొన్నారు.
అప్పలరాజు సర్టిఫికెట్లపై శాప్ ఎండీ వివరణ
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద అప్పలరాజు సర్టిఫికెట్ల విషయంలోనూ మీడియా ప్రశ్నలు సంధించింది. అప్పలరాజు తన సర్టిఫికెట్లకు బదులుగా పొరపాటున తన సోదరుడి సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారని, అనంతరం ఈ విషయం గుర్తించి, తిరిగి తన సర్టిఫికెట్లు అప్లోడ్ చేశాడని భరణి తెలిపారు. మరి ఇదే అవకాశం ఆర్చరీ గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య విషయంలో ఎందుకు వెసులుబాటు కల్పించలేదని రిపోర్టర్లు ప్రశ్నించారు.
జరగని టోర్నమెంట్‌కు సర్టిఫికెట్లు ఎలా?
ఖమ్మంలో టోర్నమెంట్ జరిగినట్లు చూపిస్తూ జారీ చేసిన జూడో సర్టిఫికెట్ల ఆధారంగా నలుగురికి ఉద్యోగాలు లభించాయని, అయితే అసలు అక్కడ ఆ టోర్నమెంట్ జరగలేదని ఆరోపణలున్నాయని మీడియా ప్రశ్నించింది. జరగని టోర్నమెంట్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? దీనిపై విచారణ జరిగిందా? అని అడిగారు.
ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, దీనిపై తాము మాట్లాడలేమని భరణి సమాధానమిచ్చారు. అలాగే మొత్తం 372 స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లపై విచారణ చేయడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. అసలు అవకతవకలు లేవని ఓపక్క చెబుతూ.. మరోపక్క వెరిఫై చేస్తున్నాం.. ఎంక్వైరీ చేస్తున్నాం.. కోర్టు పరిధిలో ఉందని చెప్పడం ఏంటని బాధిత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపైనా ప్రశ్నలు
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలో అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలపైనా మీడియా ప్రశ్నించింది. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇచ్చి, వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలపై అన్సారియా స్పందిస్తూ.. సర్టిఫికెట్లు జారీ చేసేది తహసీల్దార్లని, ఈ అంశం రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. అవసరమైతే రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చి విచారణ చేయిస్తామని వివరణ ఇచ్చారు.
సర్టిఫికెట్లు అడిగితే కేసుల హెచ్చరిక?
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అభ్యర్థులకు ఫోన్లు చేసి సర్టిఫికెట్లు చూపించాలని కొందరు అడుగుతున్నారనే అంశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. అలా ఎవరైనా సర్టిఫికెట్లు అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. కుప్పంలో ఇలాంటి ఘటనలో సాక్షి టీవీ విలేకరి, కెమెరామెన్‌పై 24 గంటల్లోనే కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ?
డీఎస్సీ-2025 నియామకాల్లో చిన్న పొరపాటు కూడా జరగలేదని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. అధికారుల వద్దకు మీడియా ఆధారాలతో వెళ్లినప్పుడు కొన్ని అంశాలపై ‘పరిశీలిస్తాం’, ‘వెరిఫై చేస్తాం’, ‘విచారణ జరుగుతోంది’ అనే సమాధానాలు రావడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు జూడో, ఖొఖో, టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు వంటి అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత రావాలని డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.








