ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు నెలలు దాటినా నెరవేర్చకపోవడం వల్లనే మహిళలు ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చుతున్నారన్నారు.
ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన దీపం పథకం ఎక్కడికి పోయింది?, ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ నిలిచిపోయింది? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని, మాటిచ్చి మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. మహిళలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసినందుకు చంద్రబాబు మీద 420 కేసు పెట్టొచ్చన్నారు.
చంద్రబాబు ప్రవర్తనపై విమర్శలు
2014లో డ్వాక్రా రుణమాఫీ పేరిట మహిళలను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు “తల్లికి వందనం” పేరిట అందరికీ రూ.15,000 ఇస్తామని ప్రకటించి, అమలు చేయలేకపోయారని ఆమె అన్నారు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవని, కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు.
2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నారా లోకేష్ ప్రగల్భాలు పలికారని, మరిప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఊసు ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. సంపద సృష్టించి పేదలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన చంద్రబాబు.. తాను మాత్రం రూ.931 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా పేరు సంపాదించాడని, పేదలను మాత్రం గాలికివదిలేశాడని శ్యామల అన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేకపోతే జనంలోకి వచ్చి అంగీకరించాలని డిమాండ్ చేశారు.