ఒంగోలులో మ‌రో లాక‌ప్‌డెత్‌..? పొలాల్లో మృత‌దేహం

ఒంగోలులో మ‌రో లాక‌ప్‌డెత్‌..? పొలాల్లో మృత‌దేహం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. విజ‌య‌వాడ సాయికృష్ణ లాక‌ప్‌డెత్ ఘ‌ట‌న పెను సంచ‌ల‌నం సృష్టించినా.. ఏపీ పోలీసుల తీరు మార‌లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. రోజుకో క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ డెత్ సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టి చంపారని తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి కన్నీరుమున్నీరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ (34) మృతదేహం ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడకు చేరుకున్న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబం కథనం ప్రకారం.. గత శనివారం రాత్రి దివ్యతేజ దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానని తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకున్నాడు. అనంతరం తన స్నేహితుడు సాతపాటి శశికాంత్‌తో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో జె.పంగులూరు పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే కొంతసేపటి తర్వాత శశికాంత్‌ను పోలీసులు వదిలిపెట్టారని, దివ్యతేజ మాత్రం పరారీలో ఉన్నట్లు చెప్పారని వారు తెలిపారు. అప్పటి నుంచి దివ్యతేజ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దివ్యతేజ కోసం తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. జె.పంగులూరు పోలీస్‌ స్టేషన్‌ తమ పరిధిలోకి రాదని, అక్కడి పోలీసులను సంప్రదించాలని కావలి సీఐ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జె.పంగులూరు ఎస్సైను కలిసి దివ్యతేజ గురించి ప్రశ్నించగా.. శశికాంత్‌ను మాత్రమే అదుపులోకి తీసుకున్నామని, దివ్యతేజ గురించి తమకు తెలియదని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎస్సై కంగారుపడ్డార‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యతేజ ఆచూకీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ నెల 1వ తేదీన కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు.

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిన కొద్దిసేపటికే పోలీసులు తమ న్యాయవాదికి ఫోన్‌ చేసి.. కండమూరు ప్రాంతంలోని పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పొలాల్లో పడి ఉందని తెలిపారు. శరీరంపై గాయాలు, కమిలిన గుర్తులు కనిపించాయని, ఇవన్నీ పోలీసుల దాడి వల్లే ఏర్పడ్డాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

“నా కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతని ఆచూకీ లేదు. చివరకు పొలాల్లో శవంగా కనిపించాడు. ఒళ్లంతా దెబ్బల గుర్తులు ఉన్నాయి. నా కొడుకును లాకప్‌లోనే కొట్టి చంపేశారు” అంటూ తల్లి సలోమీ కన్నీరుమున్నీరయ్యారు.

తమ కుటుంబం ఎస్టీ సామాజిక వర్గానికి చెందినదనే కారణంతోనే పోలీసులు తమను ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో వ్యవహరించారని దివ్యతేజ సోదరి శ్రీనిధి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, దివ్యతేజ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు వివరాలు వెలువడిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment