వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులకు రక్షణ కరువు అవుతుందన్నారు. కారంచేడు, పాధిరి కుప్పంలో దళితులు ఇళ్లకు నిప్పు పెట్టిన తరహాలోనే తడుకుపేట ఘటన చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడు నుంచి రౌడీలను తీసుకు వచ్చి తడుకుపేటలో దళితులపై దాడులు చేయించి వారి ఇళ్లను తగలబెట్టించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఎస్పీతో తాను ఫోన్‌లో మాట్లాడానని, ఆయన స్పందించిన తీరుపై నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎస్పీ ఉన్నంతకాలం దళితులు కు న్యాయం జరగదన్నారు. చంద్రబాబు తడుకుపేట ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దళితులను నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయడానికి కూడా వెళ్లనీవ్వకుండా అడ్డుకుంటున్నారని, చెప్పలు వేసుకోకూడదని హెచ్చరిస్తున్నారని, తడుకుపేటలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ తరఫున పెద్ద ఎత్తున న్యాయం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తక్షణమే ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.