న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై (Justice Yashwant Varma) వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆయనపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీ (Judicial Inquiry Committee) నిర్ధారించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను లోక్‌సభలో(Lok Sabha) బుధవారం ప్రవేశపెట్టారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో 2025 మార్చి 14న అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిన అనంతరం అక్కడ కాలిపోయిన నగదు కట్టలు కనిపించడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ వ్యవహారంపై విచారణకు లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) ముగ్గురు సభ్యులతో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ (Justice Aravind Kumar) నేతృత్వంలోని కమిటీలో బాంబే హైకోర్టు (Bombay High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీచంద్రశేఖర్(Justice Srichandrashekhar), సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య(B.V. Acharya) ఉన్నారు. కమిటీ తన నివేదికను మే 18న లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించింది.
జస్టిస్ వర్మ నివాసంలో నగదు కట్టలు కాలిపోయిన ఘటనకు సంబంధించి కమిటీ పరిశీలించిన మూడు ప్రధాన అభియోగాలు రుజువైనట్లు తాజా నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు అక్కడికి ఎలా వచ్చాయనే విషయంపై జస్టిస్ వర్మ స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ప్యానల్ అభిప్రాయపడింది.
అలాగే అగ్నిప్రమాదం జరిగిన గదిలో సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందన్న అంశాన్ని కూడా కమిటీ పరిశీలించింది. ఆరోపణలపై విచారణ సందర్భంగా జస్టిస్ వర్మ పలుమార్లు తన వాదనలను మార్చడం కూడా ప్యానల్ దృష్టికి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో, అనంతరం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తన సిబ్బందితో జరిగిన సంభాషణలకు సంబంధించిన అంశాలపై కూడా జస్టిస్ వర్మ నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని ప్యానల్ (Panel) పేర్కొన్నట్లు సమాచారం. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అభిప్రాయపడింది.
ఈ వ్యవహారంపై అభిశంసన ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ న్యాయమూర్తి పదవికి రాజీనామా (Resignation) చేశారు. అయితే ఆయన రాజీనామా చేసినప్పటికీ కమిటీ తన విచారణను కొనసాగించి నివేదికను సమర్పించింది. రాజీనామాతో ఆయనను పదవి నుంచి తొలగించే అభిశంసన ప్రక్రియకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, విచారణ నివేదిక మాత్రం పార్లమెంట్ ముందుకు వచ్చింది.
తాజా నివేదికలో ఆరోపణలు రుజువైనట్లు నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక పార్లమెంట్ స్థాయిలో తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.








