స్వర్ణముఖి నిబంధనలు హెరిటేజ్‌కు వర్తించవా?

స్వర్ణముఖి నిబంధనలు హెరిటేజ్‌కు వర్తించవా?

Summarize with AI

స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలోని నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వైసీపీ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన భూముల విషయంలో పక్ష‌పాతంగా వ్యవహరిస్తున్న అధికారులు.. చంద్రబాబు కుటుంబం వ్యాపార సంస్థ‌ హెరిటేజ్ విషయంలో ఎందుకు అదే విధంగా స్పందించడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు పలు సర్వే నంబర్లు, మ్యాప్ వివరాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేసింది.

హెరిటేజ్‌పై ఎందుకు చ‌ర్య‌ల్లేవు?
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి సంబంధించిన స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలోని భూమిని ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వ్యవహారాన్ని వైసీపీ ప్రస్తావించింది. సదరు భూమికి సంబంధించి కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరించిందని తిరుపతి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ గతంలో ఆరోపించారు.

ఈ నేపథ్యంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన భూములు, నిర్మాణాల అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. చంద్రగిరి మండలం కాసిపెంట్ల గ్రామంలోని సర్వే నంబర్ 185 పక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తోందని వైసీపీ తెలిపింది. సర్వే నంబర్ 173లో హెరిటేజ్‌కు సంబంధించిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నది బఫర్ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది.

అదేవిధంగా సర్వే నంబర్ 172లో ఉన్న హెరిటేజ్ వేస్ట్ వాటర్ సంప్ కూడా మ్యాప్ ప్రకారం స్వర్ణముఖి నదీ ప్రాంతంలోనే ఉన్నట్లు పేర్కొంది. సర్వే నంబర్లు 166, 167, 168 పరిధిలో నదీ పరివాహక ప్రాంతంలో మామిడి తోటలు ఉన్నాయని వైసీపీ తన పోస్టులో వెల్లడించింది.

స్వర్ణముఖి నది బఫర్ జోన్‌కు సంబంధించిన నిబంధనలు హెరిటేజ్ సంస్థకు వర్తించవా? సర్వే నంబర్ 173లో ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను అధికారులు ఎప్పుడైనా పరిశీలించారా? సర్వే నంబర్ 172లోని వేస్ట్ వాటర్ సంప్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మించారా? నదీ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్న మామిడి తోటలపై అధికారులు ఎప్పుడైనా సర్వే నిర్వహించి చర్యలు చేపట్టారా? అని ప్రశ్నించింది.

భూమన కుటుంబం సుమారు 24 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి విషయంలో మాత్రం ప్రభుత్వం అత్యంత వేగంగా వ్యవహరించిందని వైసీపీ ఆరోపించింది. అదే సమయంలో హెరిటేజ్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీసింది.

సామాన్యులకో న్యాయం.. సీఎం కుటుంబానికో న్యాయమా?
ప్రతిపక్ష నేతల విషయంలో ఒక విధానం, ముఖ్యమంత్రి కుటుంబంతో సంబంధమున్న సంస్థ విషయంలో మరో విధానం అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతల ఆస్తుల విషయంలో చూపిస్తున్న చొరవనే హెరిటేజ్ విషయంలోనూ చూపించి, చట్టం ముందు అందరూ సమానమేనని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకోవాలని వైసీపీ సవాల్ విసిరింది. తిరుపతి వైసీపీ లేవనెత్తిన ఈ ఆరోపణలు, సర్వే నంబర్లపై ప్రభుత్వం లేదా టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment