జనసేనకు 15 శాతం సీట్లేనా?.. లోకేశ్ వ్యాఖ్యలపై నాదెండ్ల కౌంటర్

జనసేనకు 15 శాతం సీట్లేనా?.. లోకేశ్ వ్యాఖ్యలపై నాదెండ్ల కౌంటర్

Summarize with AI

మ‌రో రెండు నెల‌ల్లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Bodies Elections) జ‌ర‌గ‌నుండ‌డంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో (TDP -Jana Sena – BJP Alliance) సీట్ల పంపిణీ (Seats Distribution) అంశం హాట్ టాపిక్‌గా మారింది. కలిసి పోటీ చేస్తామంటూనే సీట్ల కేటాయింపుపై మాత్రం భిన్నాభిప్రాయాలు బయటపెడుతున్నారు కూట‌మి నేత‌లు.

ఇటీవ‌ల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మితులైన‌ నారా లోకేశ్(Nara Lokesh).. పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ(TDP) 80 శాతం, జనసేన(Jana Sena) 15 శాతం, బీజేపీ(BJP) 5 శాతం సీట్లలో పోటీ చేస్తాయని చెప్పినట్లు ఆ పార్టీ అనుకూల ప‌త్రిక‌లోనే వార్త క‌థ‌నం ప్ర‌చురించారు. ఈ వార్త జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన పలువురు జనసేన నాయకులు ఈ పరిణామంతో నిరాశకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన సీట్ల ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలవుతుందని భావించడం పొరపాటని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలకుండా, వైసీపీని(YSRCP) అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే కూట‌మి కోసం జనసేన తక్కువ సీట్లకు అంగీకరించిందని గుర్తు చేశారు.

“కూటమిని బలోపేతం (Alliance Strengthen) చేయాలనే బాధ్యతతో మేము అప్పట్లో నాలుగు అడుగులు వెనక్కి వేశాం. కానీ అదే విధానం ఇప్పుడు కూడా కొనసాగుతుందని అనుకోవడం పొర‌పాటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం” అని నాదెండ్ల స్పష్టం చేశారు. లోకేశ్(Nara Lokesh) వ్యాఖ్యలపై వచ్చిన వార్తలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన, అవి వాస్తవం కాదని తేల్చి చెప్పారు.

అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జనసేనకు 20-25 సీట్లు మాత్రమే దక్కుతాయన్న ప్రచారాన్ని ఆ పార్టీ మొదట ఖండించినా, చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. ఇదే తరహాలో స్థానిక ఎన్నికల్లోనూ చివరకు రాజీ ఫార్ములా అమలవుతుందా? లేక జనసేన తన వాటాను పెంచుకునేందుకు పట్టుదలగా నిలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment