మగడిని కోల్పోయిన ఆ తల్లికి ఏడేళ్ల కొడుకే సర్వస్వం కావాలి. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కసాయి తల్లికి తన వివాహేతర సంబంధానికి ఆ పసివాడు అడ్డుగా కనిపించాడు. దాంతో తన ప్రియుడితో కలిసి కన్న కొడుకుపై బ్లేడుతో దాడి చేసి, చిత్రహింసలకు గురిచేసిన అమానుష ఘటన చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. వీకోటలోని ఈశ్వర్ నగర్ లో ఇంద్రజ అనే మహిళ నివాసముంటోంది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోగా, వీకోట సమీపంలోని ఎర్రచేను గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో ఇంద్రజకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇంద్రజకు ఉన్న ఏడేళ్ల కొడుకు విశాల్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వీరిద్దరూ భావించారు.
ఆ పసివాడిని వదిలించుకోవాలనే క్రూరమైన ఆలోచనతో, ఇంద్రజ తన ప్రియుడు రాజుతో కలిసి బాలుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది. అంతటితో ఆగకుండా బాలుడి శరీరంపై, మర్మాంగాలను బ్లేడుతో కోసి తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు.
బాలుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడు విశాల్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కన్న కొడుకును ఇంత కిరాతకంగా హింసించిన కసాయి తల్లి ఇంద్రజ, ఆమె ప్రియుడు రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.








