దక్షిణ భారత చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తన అమృత గానంతో కోట్ల హృదయాలను ఓలలాడించిన గాన కోకిల, లెజెండరీ గాయని (Legendary Singer) ఎస్. జానకి(S.Janaki) (88) కన్నుమూశారు(Passed Away. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆమె మైసూర్లో గుండెపోటుతో(Heart Attack) కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో దేశవ్యాప్త సంగీత ప్రియులు, ఆమె అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇటీవలే జనవరి 22, 2026న ఆమె కుమారుడు మురళీకృష్ణ (Murali Krishna) కన్నుమూశారు. కన్న కొడుకు హఠాన్మరణం తల్లిగా ఆమెను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ పుత్ర శోకంతో తీవ్రంగా విలపించిన జానకమ్మ, చివరకు మైసూర్‌లోని (Mysuru) ఆస్పత్రిలో తుది శ్వాస విడిచి అనంత లోకాలకు తరలివెళ్లారు.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) గుంటూరు జిల్లా రేపల్లె (Repalle) సమీపంలోని పల్లపట్ల గ్రామంలో (Pallapatla Village) జన్మించిన ఎస్. జానకి, చిన్న వయసులోనే సంగీతంపై (Music) ఆసక్తి పెంచుకున్నారు. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’తో సినీ నేపథ్య గాయనిగా అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 50 వేలకుపైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. భావోద్వేగం, భక్తి, జానపదం, శృంగారం, విషాదం… ఏ భావాన్నైనా తన గాత్రంతో సజీవంగా ఆవిష్కరించగల సామర్థ్యం ఆమె ప్రత్యేకత.
“సౌత్ ఇండియన్ నైటింగేల్”గా (South Indian Nightingale) అభిమానులు ప్రేమగా పిలుచుకునే జానకి, ఐదు తరాల హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించారు. అలనాటి జమున నుంచి నేటి తరం హీరోయిన్ల వరకు తెరపై కనిపించే పాత్రలకు ఆమె స్వరం సహజంగా సరిపోయేది. అందుకే ఆమెను దర్శకులు, సంగీత దర్శకులు అత్యంత విశ్వసనీయ గాయనిగా భావించేవారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో (Ilaiyaraaja) ఆమె కాంబినేషన్, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో (S. P. Balasubrahmanyam) కలిసి ఆలపించిన వేలాది యుగళగీతాలు భారతీయ సినీ సంగీతంలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.
తన విశిష్ట గాత్రానికి గుర్తింపుగా ఎస్. జానకి నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 30కిపైగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) ఆమెకు కలైమామణి పురస్కారం ప్రదానం చేయగా, మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ (Padma Bhushan) పురస్కారాన్ని, దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదనే కారణంతో ఆమె మర్యాదపూర్వకంగా తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గాయని మాత్రమే కాకుండా పాటల రచయిత్రి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలిగానూ జానకి తన ప్రతిభను చాటుకున్నారు. ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన మహిళల్లో ఒకరిగా నిలిచారు. కృష్ణుడు, సాయిబాబాపై అపార భక్తి కలిగిన ఆమె, మీరాబాయి భక్తిగీతాలను కూడా ఆలపించి భక్తి సంగీతానికి విశేష సేవలు అందించారు.
2016లో గాన రంగానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన జానకి, అభిమానుల కోరిక మేరకు 2018లో మరోసారి ఒక తమిళ చిత్రానికి పాట పాడారు. చివరి వరకు సంగీతంతో మమేకమైన ఆమె స్వరం తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఎస్. జానకి భౌతికంగా దూరమైనా… ఆమె ఆలపించిన వేలాది మధుర గీతాలు భారతీయ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. భారతీయ సినీ సంగీతం తన అత్యంత విలువైన గాన కోకిలను కోల్పోయింది.








